సైబర్ మేడారం

బుల్లక్ కార్ట్ టు సైబర్ మార్ట్ మేడ్ ఇన్ మేడారం. మేడారం కీకారణ్యం. ఇప్పుడది మహానగర మేనిఛాయలు సంతరించుకున్న టెక్నోమేడారంగా రూపాంతరం చెందింది. మేడారం మహాజాతరకు ఘడియలు సమీపిస్తున్నవి. వచ్చేనెల 5 నుంచి 8 వరకు రాష్ట్ర నలుమూలలనుంచే కాక.. దేశ, విదేశాల నుంచి లక్షలసంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. తల్లీబిడ్డలైన సమక్క-సారలమ్మలను భక్తులు తన్మయత్వంతో మోకరిల్లుతారు. సంప్రదాయ పద్ధతుల్ని పరిరక్షిస్తూనే అధునాతన సాంకేతికతను మేళవించి జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఏర్పాట్లు చేస్తున్నది. మేడారం నుంచి ఎటూ దాదాపు 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో అబ్బురపరిచే ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జాతరలో పటిష్ఠ ఏర్పాట్లుచేస్తున్నారు. జాతర పరిసరాల్లో చీమచిటుక్కుమన్నా తెలిసిపోయేలా కెమెరా కన్నుతో నిఘా పెడుతున్నారు. హైరెజల్యూషన్ కెమెరాలు నిరంతరాయంగా జాతరను జల్లెడ పట్టే ఏర్పాట్లు చేశారు. మేడారం కుగ్రామమే అయినా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు హైదరాబాద్, వరంగల్ మహానగరాలకు తీసిపోని విధంగా ఉన్నాయనటం  అతిశయోక్తికాదు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, కమాండ్ కంట్రోల్ యూనిట్లు ఇలా జాతర పరిసరాలు, పరిసర గ్రామాల్లో రెప్పవాల్చని నిఘాను కెమెరా కన్నుతో పర్యవేక్షించేలా అబ్బురపడే ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.